“ఓ... దేవుడా!! పద్మవ్యూహంలో అభిమన్యుడిలా చిక్కుకోకుండా కాపాడు తండ్రి!!" అని రోజులాగే ఉదయం ప్ర్రార్ధన చేసి ఆఫీస్ కి బయలుదేరాను. అప్పటికే టైం 9 దాటిపోవడంతో, అమృతఘడియలు అయిపోయి, రాహుకాలం, దుర్మూహర్తం కలసి కట్టకట్టుకొని మొదలయ్యాయి. మా ఆఫీస్ కి వెళ్ళాలి అంటే దారిలో హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ దగ్గర ఉన్న సొరంగం దాటాలి. దూరం నుంచి చూస్తే వైజాగ్ నుంచి అరకు రైలు లో వెళ్ళినప్పుడు దారిలో వచ్చే సొరంగాలులా ఉంటుంది. అవే కొంచెం బెటరేమో.. ఎప్పుడు బయట పడతామో తెలుస్తుంది. ఈ సొరంగం దాటడానికి ఎంత టైం పడుతుందో ఏ బ్రహ్మికీ కూడా తెలియదు. ఆ బ్రహ్మకి తప్ప... ఊళ్ళో ఎక్కడ వర్షం ఇక్కడ పెద్ద ఈతకొలను తయారవుతుంది. అందులో కార్లు, బైకులు ఈదుకుంటూ వెళ్ళాలి. అలా ఈదుతూ ముందు వెనక వెళ్లే వాళ్ళతో తిట్లు తింటూ డ్రైవింగ్ చెయ్యడం చాలా థ్రిల్ గా ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్లో అమ్మాయిల్ని ఏడిపిస్తే ప్రత్యక్షనరకం చూస్తారు అని తెలుగు టీచర్ చెప్పిన మాటలు చెవిలో రింగుమని వినిపిస్తాయి. నేను ఎవరిని ఏడిపించకుండానే నాకు ఈ బాధలు ఎందుకు తండ్రి అని దేవుడిని అడగాలి... కుదురితే కడగాలి అనిపిస్తుంది.
ఇంత ఆనందాన్ని అనుభవిస్తూ, క్లచ్ ను, బ్రేక్ ను బేలన్స్ చేస్తూ గంగిరెద్దుమేళంలా మెడలో ఓ డోలుతో (ఈ డోలునే ఆఫీస్ లో లాప్ టాప్ అంటూ ఉంటారు) ఎలగోలాగా కష్టపడి ఈ సొరంగాన్ని ఒక గంటలోనే దాటి బిజీగా ముందుకు వెళ్తూండగా, నేనేదో సుఖపడి పోతున్నట్లు విశ్వామిత్రుడి కోసం వచ్చిన మేనకలా అకస్మాత్తుగా వర్షం మొదలయింది. ఏ చెట్టు కిందన్న నిలబడదాం అనుకున్నా ఆ రోడ్డులో ఒక్క చెట్టు కూడా ఉండదు. అడ్డంగా సగం పూర్తి అయిన ఓవర్ బ్రిడ్జ్ మాత్రం ఉంటుంది. మీ ఖర్మ చావండి అని వెక్కిరిస్తూ... ఇలా ముందుకు, వెనకకు కదలలేక Laptop తడవకుండా అవస్థ పడుతుంటే, వద్దంటున్న వినకుండా "దున్నపోతు మీద వర్షం పడినట్టు" లాంటి సామెతలన్ని గుర్తుకు రావడం మొదలయ్యాయి... చివరికి మనసుని music మీదకి డైవర్ట్ చేసి "వాన వల్లప్పా వల్లప్పా" అని వాన పాటలు పాడుకుంటూ ఆఫీస్ కి వెళ్ళాను.
వెళ్ళిన గంటకి ఆంజనేయులు (పేరు మార్చబడినది) లంచ్ కి బయటకి వెళదాం అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఏదో వర్షందెబ్బని మంచి lunchతో మరచిపొదామని కార్లోనే కదా అని commit అయిపోయాను. ఆయన డ్రైవింగ్ నేర్చుకొని ఎంతో కాలం కాలేదు. ప్రావీణ్యాన్ని చూపించాలని మాంచి ఉత్సాహంతో ఉన్నాడు. బయలుదేరే ముందు మనసులో ఇంత కుట్ర ఉందని నాకు తెలియదు.
ఫరవాలేదు బానే డ్రైవ్ చేస్తున్నాడే అనిపించేసరికి. దూరంగా హైటెక్ సిటీ సిగ్నల్స్ రాఘవేంద్ర రావు సినిమా Heroine బొడ్డుమీద జాంపండులా ఊరిస్తూ కనపడ్డాయి. క్రాస్ చేస్తామా? లేదా? అని టెన్షన్ లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఎవడో రెచ్చిపోయి, మా కార్ ని ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్ళి turn తీసుకున్నాడు. వాడికి గుణపాఠం చెప్పితీరాల్సిందే అని అంజి కార్ స్పీడ్ పెంచాడు. ఇంతలో auto అకస్మాత్తుగా అడ్డం రావడంతో సడెన్ బ్రేక్ వేసాడు. పెద్ద శబ్దం తో కార్ ఆగింది. పండు చేజారిపోయింది. పళ్ళు రాలిన అంత పనిఅయ్యింది. రెడ్ సిగ్నల్ పడింది.
వాడిని తిట్టటం అయ్యాక మావాడు చిదంబరంలా ఒక statement పారేశాడు "ఇండియా కార్లని సరిగా డిజైన్ చేయలేదయ్యా! Architecture అంత బాగుండదు. breakకి, acceleratorకి ఒకే కాలు ఉపయోగించాలి. పొరపాటున break బదులు accelerator తొక్కితే ప్రాబ్లెం కదా?!" ఆన్సైట్ తెలివితేటలు వాడుతూ. దాని అర్ధం ఏంటి? పొరపాటున break బదులు accelerator వాడితే తప్పు కార్ దే తప్ప నాది కాదు అని... :O "
ఆ దెబ్బతో, నేను attentionలోకి వచ్చేశాను. భయానికి ట్రాఫిక్ జాం తోడయ్యింది. ముందుకి వెళ్ళడానికి లేదు. వెనక్కి వెళ్ళడానికి లేదు. అంజి గాడు ఫస్ట్ గేర్ లో మెల్లిమెల్లిగా కార్ ని నడిపిస్తున్నాడు. అప్పటికి గంట నుంచి, క్లచ్ మీద కాలు ఉంచి, తీసి విసుగొచ్చి "నా వల్ల కాదు.కాళ్ళు నెప్పెడుతున్నాయి. నేను కార్ వదిలేసి వెళ్ళిపోతా" అని గోల చేయడం మొదలెట్టాడు. అన్యాయం. అక్రమం. కుట్ర. ఇలాగే ముందుకి, వెనకకి వెళ్ళడానికి లేని పరిస్థితిలో ఉన్న ప్రాజెక్ట్ ని వదిలిపెట్టి నేనుప్పుడైనా వెళ్ళిపోయానా? అమ్మో! ఇప్పుడు నన్ను గాని drive చెయ్యమంటే నా పరిస్థితి ఏంటి? నాకు లైసెన్స్ అయితే ఉంది కాని డ్రైవింగ్ రాదు ( ష్! ఎవరితోను చెప్పకండే!). code అయితే గూగుల్ లో వెతికి కాపీ పేస్ట్ చేయగలను గాని, driving కాపీ పేస్ట్ చేయలేను కదా... ఉదయాన్నే నా మొహం నేను అద్దం లో చూసుకున్న ఎఫెక్ట్ ఏంటో నాకప్పుడు అర్ధం అయింది. :(
ఇలా అడ్డంగా అడ్డొచ్చే ఆటో వాళ్ళని తిట్టుకొంటూ, ఫోన్ మాట్లాడుకొంటూ రోడ్డు దాటే "సైంధవులని" దాటుకుంటూ, రాంగ్ రూట్లొ ఎదురొచ్చి మననే తిట్టే వాళ్ళని ఎదుర్కుంటూ, రోడ్డు మధ్యలోకొచ్చిన తర్వాత వెళ్దామా? వద్దా? అని ఆలోచించే మేధావులని ఆశ్చర్యంగా చూస్తూ, అప్పుడప్పుడు ఎద్దుల బండిలో వెళ్ళే వాళ్ళని చేజింగులు చేస్తూ, ట్రాఫిక్ జాములు, సిగ్నల్సు అన్ని దాటుకొని వెళ్ళేప్పటికి సప్త సముద్రాలు దాటినంత ఆనందం కలిగింది. అసలే బయలుదేరి చాలాసేపు అయిందేమో విపరీతమైన ఆకలి. కార్ దిగీ, దిగగానె వరద బాధితుల్లా భోజనానికి పరిగెట్టాం...
Late అయినా latestగా ఉంటుంది అని వచ్చెటప్పుడు మాత్రం సిటీ బస్ ఎక్కి వచ్చెశా... మనసుకు మాత్రం మాడెస్టీ అని సర్ది చెప్పుకుంటూ...