శ్రీరాముడు-చారు.

శ్రీ రఘురామ! చారుతులసీదళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ ! త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామ ! జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ ! భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!!


తాత్పర్యం:
శ్రీరఘురామ = శ్రీరాములవారు చారు = ఒక రోజు జ్వరం వచ్చి చారు కాపించుకున్నారు. తులసిదళధామ = ఆ దేశములో కరివేపాకు లేకపోవడంతో తులసాకులు వేసి పొంగించారు. శమక్షమాది శృంగార గుణాభిరామ = శ్రమయావత్తూ పోగొట్టగలిగి బహుశృంగారంగా ఉందా చారు. త్రిజగన్నుత శౌర్యరమాలలామ = ఆ చారు తాగిన తర్వాత రాములవారికి రాక్షసులు అందరినీ చంపగలిగిన శౌర్యం కలిగింది. జగజ్జన కల్మషార్ణవో తారక రామ = ఆచారు తారక మంత్రములా త్రాగిన జనులందరకు కల్మషము కొట్టివేసినది. దుర్వారకబంధ రాక్షస విరామ = దాంతో వారికందరకు కఫం పట్టకుండా పోయింది. భద్రగిరి = వారికి ఎంతో భద్రం కలిగినది.

-- చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి "గణపతి" నుండి.