వసుదేవుడు -- గాడిద కాళ్ళు.

వెనకటికి ఒక సామెత ఉండేది. అవసరానికి వసుదేవుడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అని (తెలియని వాళ్ళకి: వసుదేవుడు అంటే లార్డ్ కృష్ణ ఫాదర్). మనం అంత గొప్పవాళ్ళం కాదు కనుక ఏదో మన rangeలో అప్పుడప్పుడు, తప్పని పరిస్థితిలో చుట్టుపక్కల ఉన్న కొన్ని అడ్డగాడిదల కాళ్ళు పట్టుకుంటున్నాం. Trafficలో దొరికిపోయినప్పుడు case లేకుండా పోలీస్ కాళ్ళు, లైన్లో టికెట్స్ దొరకనప్పుడు blackలో అమ్మెవాడి కాళ్ళు, Government officeలో పనులు పూర్తవ్వడానికి attender కాళ్ళు etc. etc.

ఇలా పట్టుకొని పట్టుకొని మనకి అలవాటు అయిపోయింది. కాని కలియుగంలో గాడిదలు కాళ్ళతో సరిపెట్టుకోవు. వాటికి కడుపునిండా గడ్డి కూడా పెట్టాలి. గడ్డితిని ఇవి కడివెడు ఖరము పాలు మనకు ప్రసాదిస్తాయి. వాటినే మనం తీర్థప్రసాదాల్లా భావించి మన luckకి పొంగిపోతూ స్వీకరించాలి. కాదు కూడదు నేను గాడిదలను బ్రతిమిలాడను, అంటేమాత్రం మీరు మూడు చెరువుల నీళ్ళు తాగాల్సిందే. కొన్ని గాడిదలు మహామొండివి ఉంటాయి. అవి గడ్డితింటూ కూడా నీతులు చెప్తుంటాయి. చెప్తూపోతే వాటి లీలలు కోకొల్లలు.

ఇన్ని గాడిదల మధ్య ఎప్పుడో 60ఏళ్లకోసారి అన్నాహజారేలా 121కోట్లలో ఒకడు, నాలుగురోజులు తిండి మానేసి కూర్చుంటే గాడిద గడ్డితినడం మానెస్తుందనుకోవడం అత్యాశ అవుతుంది. అయినా మనం చెయ్యగలిగింది ఏముంది? తింటే గడ్డి పెడతాం. లేదంటే కాళ్ళు పడతాం. మనకి పని అవ్వడం important. ఎలా అయింది అని కాదు.ఇప్పటికీ ఏం చెయ్యాలో తోచకపోతే కొసమెరుపుగా భాస్కరశతకములోని ఈ పద్యం చదువుకోండి....

ఘనుడగునట్టివాడు నిజ కార్యసముద్ధరణార్థమై మహిం
బనివడి యల్పమానవుని బ్రార్థనజేయుట తప్పుగాదుగా,
యనఘతగృష్ణజన్మమున నా వసుదేవుడు మీదటెత్తుగా
గనుగొని గానివాడకడ కాళ్ళకు మ్రొక్కడెనాడు భాస్కరా!


తా. కృష్ణుడు జన్మించగానే యతనిని గంసునివలన బాధలేకుండ జేయ వ్రేపల్లెకు దీసికొనపోవనెంచి కావలివారికిం దెలియకుండబోవుచు దానొనరించు పనికంతరాయము గలుగుకుండుటకయి గాడిదకాళ్ళకు వసుదేవుడు మ్రొక్కినట్లే, ప్రపంచమున మనుష్యుడు తన పని నెఱవేర్చుకొనుటకొక యల్పుని బ్రార్థించినను దానివలన దోషములేదు.