దేవుడు మనకి అనేక వరాలు ఇచ్చాడు. గాలీ... నేలా... చెట్టూ... పిట్టా... వానా... వెన్నెలా... వీటితో పాటే మాట్లాడటానికి నోరూ, రాయడానికి చేతులూ కూడా ఇచ్చాడు. నమ్మకం లేని వాళ్లకి ఇవి Darwin కోతి నుంచి వచ్చాయి.అందువల్ల మనం దేవుడికి ఏవేవో సమర్పిస్తుంటాం. డార్విన్ మహానుభావుడని ఒప్పేసుకుంటాం. కాని మనకు S.M.S అనే విద్యను, జ్ఞానాన్ని నేర్పిన GLOBALISATION కి బదులు గా ఏం ఇవ్వగలం? SMS కొడుతుంటే చేతి వేళ్ళు వీణ వాయించినట్లు, వాయులీనాన్ని పలికించినట్లు, బిస్మిల్లాఖాన్ షహనాయి రాగం పలికినట్లు ఫీల్ అయిపోవడం తప్ప...
నిజానికి ప్రేమించుకోవడం అనే అద్భుతమయిన అనుభూతి కోసం పూర్వకాలంలో మన్మధుడి బాణం కోసం నిరీక్షిస్తూ కూర్చోవలసి వచ్చేది. తర్వాత కాలంలో ఎదురుపడి ఒకరిని ఒకరు చూసుకొని "కనులు కనులు కలిసెనూ..." అని పాడుకోవలసి వచ్చేది. ఆతర్వాత "ఏ మేరా ప్రేం పత్ర్ పడ్ కర్" అని రఫీ పాటతో ప్రేమలేఖలు రాసుకోవలసి వచ్చేది.అయితే వీటిఅన్నిటిలో గొప్ప రిస్క్ ఉంది.
మన్మధబాణం వేస్తుండగా ఎవరయినా చూస్తే? ఏ పులో సింహమో దున్నపోతో అడ్డు వచ్చి బాణానికి తగిలితే? శివుడు, పార్వతికి బదులు మహిషాశురుడినో పులిరాజునో ప్రేమించేసి ఉండేవాడు.అప్పుడు కుమారుడు ఎలా సంభవించేవాడు? పోనీ చూపులు కలిసిన శుభవేళ ప్రేమించుకుందాం అంటే... చూపులు కలిసేదాకా టైం ఎక్కడ ఉంది? యువతి యువకులు పాపం పగలంతా నిద్రపోయి రాత్రి B.P.Oలోనో Software-companyలోనో పనిచేసి మేలుకున్న ప్రతి క్షణము జోగుతున్న ఈరోజుల్లో చూపులు మీద ఆధారపడితే retirement దాకా ఆగాల్సిందే.
ఇక ప్రేమలేఖలు. అంత ఓపిక ఎవడికి ఉంది? రాయాలి అంటే భావాలు కావాలి. భాష రావాలి.పెన్ కావాలి. కాయితం దొరకాలి. ప్రేమలేఖ చేరి, తిరుగు లేఖ రావడానికి ఒక వారం ఎదురుచూడాలి. ఈ లోపు మరో అబ్బాయో అమ్మాయో కనపడి మనసు దోచేసుకోరని గారెంటీ ఏంటి? E-Mailలో ప్రేమించుకుందామా అంటే అది కూడా టైం పట్టే వ్యవహారమే... కంప్యూటర్ ఉండాలి. ఇంటర్నెట్ పనిచెయ్యాలి. కరెంటు దేవతలు అనుగ్రహించాలి. వాళ్ళు మనం రోజు మెయిల్స్ చెక్ చెయ్యాలి... ప్చ్ కష్టం.
కనుక, ఇన్ని Riskలున్న పద్ధతుల్లో ప్రేమించడం ఇక చెల్లదు. SMSలు అందరికి శిరోధార్యాలు. మనం ఎవరిని ప్రేమిస్తున్నామో చూడక్కరలేదు. గొంతు వినక్కరలేదు. భాష రాదని... రాత కోడి కెలికిన గింజల్లా ఉందని ఫీలింగ్ అక్కరలేదు. Spellings రావని ప్రేమించడం మానేస్తారని బెంగ అక్కరలేదు. చూపులు చాలా డేంజర్. మనం వాళ్ళని అలా చూడటం ఎవడో ఒకడు చూసేస్తాడు. ఉత్తరాల Addressని ఎవడో చదివేస్తాడు. లేదా ఉత్తరాలే చదివేస్తు ఉంటాడు. అదే SMS అయితే మన ప్రేమని ఎంత దాస్తాయి అంటే ఒక్కోసారి మనం ప్రేమించే వాళ్ళకి కూడా అర్థం కానంత గొప్పగా దాచేస్తుంది.పైగా ఎదుటివాళ్ళు మనల్ని ప్రేమించినా, ప్రేమించకపోయినా, తిట్టుకున్నా మనకి అవి తెలియవు. ఎంచక్కా Oneway ప్రేమని life long చెప్పుకుంటూ పోవచ్చు. ఒక్క ఐ లవ్ యు SMSని సేవ్ చేసుకుంటే ఎంచక్కా ఉత్తరోత్తర అనేక మందికి పంపడానికి పనికి వస్తుంది కనుక శ్రమ ఉండదు. ఒకటే జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. SMS రాశాక అది మన ఆడ బాస్ కా, ప్రియురాలికా, స్నేహితురాలికా, భార్యకా, ఆడ బాస్ భర్తకా, మాజీ ప్రియురాలి భర్తకా ఎవరి నెంబర్ కి పంపుతున్నాం అని ఓ సారి అలా అలా చూసుకుంటే మన ఆరోగ్యానికి, ఇతరుల ఆరోగ్యానికి కూడా మంచిది.
-- తస్కరణ: మృణాళినిగారి 'తాంబూలం' నుంచి.
No comments:
Post a Comment